ఇస్లాంలో వక్ఫ్ అంటే, సాధారణ పరిభాషలో వ్యక్తులు, సంస్థలు దేవుని పేరుతో పేదలకు, సమాజంలోని అవసరార్థుల కోసం ఇచ్చే విరాళాలు. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులు ఈ బాధ్యతను నిర్వహిస్తూనే ఉన్నాయి. కానీ కోల్‌కతా నుంచి తిరువనంతపురం దాకా భారత్‌లో ఉన్న 35 రాష్ర్ట వక్ఫ్ బోర్డులు ఏ లెక్కన చూసినా ఇతరుల బాగోగులను సమర్థంగా చూసే పరిస్థితుల్లో లేవు. భారీ ఆస్తులకు యజమానులైన ఆ సంస్థల వద్ద జవాబుదారీతనమే లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం!
శక్తిమంతమైన ఈ వక్ఫ్ బోర్డుల తీరుతెన్నులు నిజంగా ఆసక్తికరం: వీటన్నింటి వద్దా కలిపి దాదాపు 5 లక్షల రిజిస్టర్డ్ ఆస్తులున్నాయి. 6 లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయి. వాటి పుస్తక విలువే తక్కువలో తక్కువ రూ.1.2 లక్షల కోట్లుంటుంది! అద్దెలు, హెఊర్డింగులు, యాజమాన్య మార్పులు, అమ్మకాల రూపంలో దాదాపు రూ. 163 కోట్ల దాకా ఆదాయం వస్తోంది.
ఈ వివరాలను పరిశీలిస్తే...
... ఢిల్లీలోని మొత్తం భూమిలో 77 శాతం వక్ఫ్‌బోర్డుకు చెందిందే. ఎన్నో పత్రికా కార్యాలయాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హెఊటళ్లు, కోర్టులు, మాల్స్, మార్కెట్లు, స్కూళ్లు, కాలేజీలు వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలాల్లోనే నిర్మించారు. వక్ఫ్‌బోర్డు మేనేజ్‌మెంట్ ఆ భూములను కాపాడుకోవడంలో గానీ ఇంతకు మించి ఉపయోగించుకోవడంలో చేతులెత్తేసింది.
... మధ్యప్రదేశ్ వక్ఫ్‌బోర్డు, షాహి ఆకాఫ్, ఆకాఫ్ ఆమ్మా... ఇవి మూడూ మధ్యప్రదేశ్‌కు చెందిన వక్ఫ్ సంస్థలు. ఈ మూడింటికీ ఉమ్మడిగా 14,533 స్థిరాస్తులున్నాయి. వాటి విలువ రూ.55 వేల కోట్లు. 1999లో ఆలిండియా ముస్లిం త్యోహార్ కమిటీ జరిపిన సర్వే ఆ స్థిరాస్తుల వార్షిక ఆదాయాన్ని లెక్కించింది. అద్దెలు, ఇతర రూపాల్లో మధ్యప్రదేశ్ వక్ఫ్‌బోర్డు వార్షిక ఆదాయం దాదాపు రూ.55 లక్షల దాకా ఉంటుంది. 1961లో వక్ బ్ఫోర్డు ఆడిటర్లు ఎనిమిది మంది ఉండేవారు. ఇప్పుడా సంఖ్య ఇద్దరికి దిగిపోయింది. 1961 లో వక్ఫ్‌బోర్డుకు 187 శ్మశానాలు ఉండేవి. ఇప్పుడు 23 ఉన్నాయి.
... కర్నాటకలో వక్ప్‌ఖు 32,334 స్థిరాస్తులుండగా వాటి విలువ దాదాపు రూ. 440 కోట్లు. ఆయా న్యాయస్థానాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులతో సంబంధమున్న దాదాపు 700 కేసులున్నాయి. కాగా వాటిల్లో కొన్ని కేసులైతే 50 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వక్ఫ్ భూములకు సంబంధించి తాజాగా సర్వే చేపట్టాలనుకుంటున్నట్లు కర్నాటక ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
... ఆంధ్రప్రదేశ్‌లో మసీదులు, దర్గాలు, ఆషూర్ఖానాలు, శ్మశానాలు, తఖియాలు, ఈద్గాలు, ఇమాంబరాలు, అంజుమాన్లు... వంటి 3,703 వక్ఫ్ సంస్థలకు 1,33,209 ఎకరాల భూమి ఉన్నట్లు సర్వే కమిషనర్ నివేదిక చెబుతోంది. మొత్తం వక్ఫ్‌బోర్డుకు చెందిన 1.35 లక్షల హెక్టార్ల భూమిపై పలు కోర్టుల్లో దాదాపు రెండు వేల కేసులు పెండింగులో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, మైనారిటీ సాధికారత చాలా తక్కువ. వక్ఫ్ నిధుల దుర్వినియోగం, భూమ్యాక్రమణలు ఎన్నికల సమయంలో పెచ్చుమీరుతాయి. ''1997లో సీపీఐ(ఎం) అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఎన్నో వక్ఫ్ ఆస్తులను అమ్మేయడమో, లీజులకివ్వడమో, లేదంటే అస్మదీయులకు కట్టబెట్టడమో చేస్తూనే వస్తోంది'' అంటూ రాష్ర్టానికి చెందిన కేంద్ర పర్యాటక శాఖా మంత్రి సుల్తాన్ అహ్మద్ ఆరోపించారు. ''మా ఒత్తిడి మూలంగా ముఖ్యమంత్రి జ్యోతిబసు వక్ఫ్ ఆస్తుల అవకతవకలపై న్యాయవ్యవస్థ కార్యదర్శి పి.కె. సేన్‌గుప్తా ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ఆయన నివేదిక మా ఆరోపణల్ని బలపరచడంతో విశ్రాంత న్యాయమూర్తి గీతేష్ రంజన్ భట్టాచార్జీ ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశించారు'' అని వివరించారాయన. 2001లో భట్టాచార్జీ 1200 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం-అ 1980-అ85 మధ్యకాలంలో వక్ప్‌కు చెందిణ తొమ్మిది స్థిరాస్తులు 1986-అ95 మధ్యకాలంలో 117 స్థిరాస్తులు చేతులుమారాయి. వీటిల్లో ఇరవైఎనిమిదింటిని అమ్మేయగా, లీజుకిచ్చిన వాటి సంఖ్య 47. మరో 21 పలు లావాదేవీల్లో భాగంగా ఇచ్చిపుచ్చుకోవడంలో స్వాహా చేశారు. మరో ముప్పయ్ దాకా ప్రమోటర్ల పరమయ్యాయి. అయితే కొన్ని లావాదేవీలకు సంబంధించి బోర్డు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మినహాయించి వక్ఫ్‌బోర్డు రిజిస్ర్టార్ మాత్రం ఎటువంటి డాక్యుమెంట్లు గానీ, దస్తావేజులు గానీ, ఒప్పంద పత్రాలు గానీ ఇవ్వలేకపోవడం ఆశ్చర్యకరం. వీటిల్లో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయా ఆస్తులకు సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోవడం గానీ, న్యాయసంబంధమైన చర్యలు తీసుకోవడం గానీ జరగలేదు. టెండర్లు, ఆక్షన్ల వంటివేమీ జరగకుండానే ఈ ఆస్తులన్నీ చేతులు మారాయి. వక్ఫ్ బోర్డు సదరు ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆడిటింగ్ కూడా సరిగ్గా నిర్వహించకపోవడం విడ్డూరకరం.
ఇంతకీ ఈ ప్రహాసనం ఎలా జరిగింది? వక్ఫ్ ఆస్తుల నిర్వహణ ముటావల్లీలు(మేనేజర్లు) చూసుకుంటారు. వారు సాధారణంగా ప్రభుత్వ నామినీలే అయి ఉంటారు. వక్ఫ్ భూముల్ని అత్యంత తక్కువ ధరకే అమ్మేలా చేస్తారు. తర్వాత అప్పటిదాకా ఎందుకూ పనికిరానిదిగా చలామణి అయిన ఆ ఆస్తి విలువ ఒక్కసారిగా ఆకాశాన్నంటుంది. ''2009-అ10 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, బోర్డు అసలు ఆదాయం దాదాపు రూ. 2.68 కోట్లు. ఇంకా ప్రభుత్వ ఆధీనంలోకి రాని ఆస్తుల ఆదాయం రూ.1.82 కోట్లు'' ఉంటుందని పశ్చిమ బెంగాల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ అధికారి, బోర్డు సీఈఓ అబ్దుల్ గనీ వివరించారు. అంటే గొప్ప ఆర్థిక పరిపుష్టి కలిగిన ముస్లిం వ్యవస్థను ప్రభుత్వ కోశాగారంపై ఆధారపడే దుస్థితికి దిగజారుస్తున్నారు. బోర్డు ఆస్తుల్లో పెద్ద పెద్ద వాటిని ఉత్తి పుణ్యానికి అమ్మేస్తున్నారు.
నిజానికి ముస్లిం కమ్యూనిటీ పక్షాన నిలబడుతోంది వక్ఫ్ బోర్డు కాదు, కోల్‌కత్తా హైకోర్టు! ఉదాహరణకు, కోల్‌కత్తా నగరానికి తలమానికాలైన షా వాలేస్ బిల్డింగ్, అధునాతన హంగులున్న రాయల్ కోల్‌కత్తా గోల్ఫ్ క్లబ్(ఆర్‌సీజీసీ), టోలీగంజ్ క్లబ్ ఏళ్లతరబడి నామమాత్రపు అద్దెలు చెల్లిస్తూ వస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం టోలీగంజ్ క్లబ్ నెలసరి అద్దె కింద రూ.లక్ష చెల్లిస్తుండడంతో పాటు రూ.22లక్షలు ఎరియర్స్ కోసం డిపాజిట్ చేసింది. అదేవిధంగా గోల్ఫ్ క్లబ్ కూడా నెలకు రూ.లక్ష అద్దెతో పాటు ఎరియర్స్ కింద రూ.38 లక్షలు చెల్లించింది. అంతే కాదు, విజయ్ మాల్యా తన ఆధీనంలో ఉన్న షా వాలేస్ కోసం ఎరియర్స్ రూపంలో రూ.కోటితో పాటు, నెలసరి అద్దె రూ.ఏడు లక్షలు చెల్లిస్తున్నాడు!
అస్సాంలో 177 రిజస్టర్డ్ వక్ఫ్ స్థిరాస్తులున్నాయి. అవన్నీ పలు సందర్భాల్లో పలువురు వ్యక్తులు వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చినవే. భూమి విరాళంగా ఇచ్చిన దాత సదరు ఎస్టే ట్‌కి వీలునామాల్లో గానీ, దస్తావేజుల్లో గానీ మేనేజర్‌ని నియమిస్తారు. సదరు మేనేజర్ల తదనంతరం వారి కుమారులు ఆ ఆస్తి నిర్వహణా బాధ్యతల్ని తీసుకుంటారు. ప్రస్తుతం చాలావరకు వక్ఫ్ ఎస్టేట్ల నిర్వహణ ఇటువంటి ముటావల్లీలే(మేనేజర్లు) చూసుకుంటున్నారు. వారు ప్రభుత్వం మంజూరు చేసే నిధుల్లో కేవలం ఏడు శాతం మాత్రమే వక్ఫ్‌బోర్డుకు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వం రూ. 25లక్షలు మంజూరు చేస్తే వారు బోర్డుకు చెల్లించేది రూ.లక్ష మాత్రమే.
చేతులు దులుపుకున్నంత సులువుగా వక్ఫ్ ఆస్తుల రూపురేఖల్ని అవసరానికనుగుణంగా మార్చేస్తున్నారు. మైసూరులో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇందుకు చిన్ని ఉదాహరణ. మైసూర్ రాష్ట్ర దివాన్ మీర్జా ఇస్మాయిల్ తాతగారు అలీ అస్ఘార్ 19వ శతాబ్దంలో భూమి విరాళంగా ఇచ్చారు. 1973లో దాన్ని మోనార్క్ కార్పొరేషన్‌కు నెలకు రూ.3,100 చొప్పున అద్దెకు 30 ఏళ్లకు లీజుకిచ్చారు. లీజు గడువు 2003 సంవత్సరానికి పూర్తవుతుంది. కానీ గడువు పూర్తవకుండానే 1974లోనే లీజు గడువును మరో 20 ఏళ్లకు పెంచుతూ మరో ఒప్పందాన్ని తయారుచేశారు. ఈ ఒప్పందానికి వక్ఫ్‌బోర్డు అనుమతి తీసుకోలేదు. తర్వాత 2063 వరకు మరో పొడిగింపు ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు. 1983లో వక్ఫ్ బోర్డు మంత్రి అబ్దుల్ నజీర్ ఈ చట్టవిరుద్ధమైన అద్దె ఒప్పందాన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. అయినప్పటికీ కొన్ని లక్షల రూపాయల నెలసరి అద్దె చెల్లిస్తూ ఆ స్థలంలో ఒక ఐదు నక్షత్రాల హెఊటల్ నడుస్తోందిప్పుడు. ''భారత చరిత్రలో వక్ఫ్ అతిపెద్ద భూకుంభకోణంగా నిలిచిపోతుంది. ఆరు లక్షల ఎకరాల భూమి, పలు స్థిరాస్తులు కలిగి ఉండి కూడా ముస్లింలు భారతదేశంలో నిరుపేద సామాజిక వర్గంగా మిగిలిపోతున్నారు'' అని రచయిత, సామాజిక కార్యకర్త ఫిరోజ్‌బఖ్త్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు కేరాఫ్ ఎడ్రస్‌లుగా తయారవుతున్న వక్ఫ్‌బోర్డులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ప్రక్షాళన చేస్తే గానీ పరిస్థితిలో మార్పుండదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన. బిల్డింగులు, హొటళ్లు, మాల్స్, ఫ్యాక్టరీల వాణిజ్య సంబంధ నిర్మాణాలకు వక్ఫ్ భూముల్ని నామమాత్రపు ధరలకే అన్యాక్రాంతం చేస్తున్న కేసులెన్నో ఉన్నాయి ఇటీవలి కాలంలో. మంత్రిపదవులు దక్కని ముస్లిం నాయకులు తమ రాజకీయ ప్రాపకం కోసం వక్ఫ్ బోర్డులను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. భూఆక్రమణదారులతో చేతులు కలుపుతున్నారు'' అని ఫిరోజ్ బఖ్త్ చెబుతున్నారు.
అక్షరాస్యత, జవాబుదారీతనం ఎక్కువగా ఉన్న కేరళ వంటి రాష్ర్టాల్లో బోర్డు నిర్వహణ పూర్తిగా వృత్తి నైపుణ్యం కలిగినవారే చూస్తారు. ఇద్దరు అడ్వకేట్ల ఆధ్వర్యంలోనే బోర్డు నిర్వహణ జరుగుతుంది.
వక్ఫ్ బోర్డుల నిర్వహణ తీరుతెన్నులు సరిగా లేవని ఢిల్లీ నగర అభివృద్ధి మంత్రి హరూన్ యూసుఫ్ అంగీకరిస్తున్నారు. ఆయన ఢిల్లీ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ కూడా! ''వక్ఫ్ ఆస్తుల రెవెన్యూ పెరగాలంటే అద్దెల పునర్‌వ్యవస్థీకరణ జరగాలి. ఉదాహరణకు ఒక స్థిరాస్తికి నెలసరి అద్దె రూ.20 వేలు వస్తే కనీసం రూ.10వేలు వక్ఫ్‌బోర్డుకు చెందాలి. రూ. వెయ్యితోనే ఎందుకు సరిపెట్టాలి?'' అని ప్రశ్నిస్తారు. భూఆక్రమణదారులకు వ్యతిరేకంగా చట్టం చాలా కచ్చితంగా ఉండాలి. వక్ఫ్ బోర్డు ఉద్యోగులను ఇతర విభాగాలకు తరచూ బదిలీలు చేస్తూ ఉండాలి.
''శ్మశానాలు, మజీదులు, దర్గాలు... వంటి వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను అమ్మలేం. అటు అద్దెకివ్వనూలేం. ఎందుకంటే వాటిని మరో రకంగా ఉపయోగించలేం. ఇలాంటి సందర్భాల్లో అక్కడ సిబ్బందికి జీతాలివ్వడమే గగనమవుతుంది. ప్రభుత్వ నిధులపైనే ఆధారపడాల్సివస్తుంది'' అని వక్ఫ్ ఆస్తుల విషయంలో కొత్త కోణాన్ని తెలిపారు ఢిల్లీ వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మన్ చౌదరి మటీన్.
మారుతున్న పరిస్థితులకు పాత చట్టాలు పనికిరావని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ''ప్రస్తుత అద్దెవిధాన చట్టాలతో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుకోవడం అంత సులువు కాదు. బోర్డుకు మరిన్ని అధికారాలను కట్టబెడుతూ వక్ఫ్ చట్టాల్లో క్లాజులను సవరించాల్సిన అవసరం ఉంద''న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త ఇలియాస్‌మాలిక్.
ఫరీద్‌ఖాన్ లాంటి మరికొందరు వక్ఫ్‌బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ చిత్తశుద్ధి లోపిస్తోందని నిందిస్తున్నారు.
''ఛారిటీ కమిషనర్ నుంచి ఎన్‌వోసీ పొందిన తర్వాత మార్కెట్ విలువకు కొనుగోలు చేసేవారికి వక్ఫ్‌బోర్డుకు చెందిన విలువైన భూముల్ని బఠాణీల్లాగా అమ్మేస్తున్నారు. ముంబయిలోని ఆల్టామౌంట్ రోడ్డులో ముకేష్ అంబానీకి చెందిన యాంటిలియా భవంతి ఇందుకు మంచి ఉదాహరణ. ఫలితంగా భారతదేశ వాణిజ్యరాజధానిలో వక్ఫ్‌బోర్డుకు సొంత కార్యాలయం లేకుండాపోయిం''దని వివరిస్తారు ముంబయి హైకోర్టు సీనియర్ న్యాయవాది సయీద్ ఆఖ్తర్. తమిళనాడులో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. ''వేలాది ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పరమైంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోవడంలేదు. కనుక వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని తమిళనాడు దావ్హీత్ జమాత్ నాయకుడు జైనులాబుద్దిన్ డిమాండ్ చేస్తున్నారు. ''బోర్డు, దాని సభ్యులు ముస్లిం ప్రతినిధులుగా కాకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. అసలు బోర్డు ఏర్పాటుచేసిందే అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తుల్ని జప్తు చేసుకుని తద్వారా రెవెన్యూ పెంచుకోవాలని. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా అందుకు విరుద్దంగానే!'' అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారాయన.
''అన్యాక్రాంతమైపోయిన వక్ఫ్ భూముల్ని తిరిగి పొందడం అంత సులువేం కాదు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి జోక్యం లేకుండా బోర్డుకు పూర్తి స్వేచ్ఛనిస్తే అది సాధ్యమే''అంటారు ఏఐఏడీఎంకే నాయకుడు, వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్‌పర్సన్ టీఎస్‌ఐతో మాట్లాడుతూ. మరిన్ని వివరాలకు తమ వెబ్‌సైట్ చూడమని వక్ఫ్‌బోర్డు అధికారులు టీఎస్‌ఐకి సూచించారు. కానీ ఆ వెబ్‌సైట్ 2005 సంవత్సరం వరకే అప్‌డేట్ అయి ఉండడం ఆసక్తికరం.
వక్ఫ్‌బోర్డు నిర్వహణలో మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే ఎంతో మెరుగ్గా ఉన్న కేరళలో కూడా నిర్వహణాలోపాలు, అవినీతి చోటుచేసుకున్న దాఖలాలున్నాయి. కోజీఖోడ్‌లో వక్ఫ్‌కు చెందిన ఒక ఆస్తిని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీకి 1975లో నెలకు రూ.250 చొప్పున అద్దెకిచ్చారు. అదికూడా వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండానే! ఏ ఆస్తినీ మూడేళ్లకు మించి లీజుకు ఇవ్వరాదన్న వక్ఫ్ చట్టాన్ని పక్కనబెట్టి కావాలని అదే నగరంలో ఒక పెట్రోల్ బంకు నెలకు రూ.800 అద్దె చొప్పున బోర్డుకు చెల్లిస్తోంది.
''వక్ఫ్ బోర్డుల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సంచార్ కమిటీ అంగీకరిస్తోంది. ఈ విషయంలో మార్పు తీసుకురావాలంటే చట్ట సవరణ జరగాల్సిందే. లేదంటే బోర్డు నిర్వహణలో ఏరోజుకారోజు అవసరాన్ని బట్టి మార్పుచేర్పులు చేసుకోవాలి'' అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జకత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జాఫర్ మెహ్మూద్. ''దేశంలో మొత్తం 35 రాష్ట్ర వక్ఫ్‌బోర్డులున్నాయి. చట్టం ప్రకారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) తప్పనిసరిగా పూర్తి అర్హతలు కలిగినవాడై ఉండాలి. షిల్లాంగ్‌లో బోర్డు సీఈవో పదో తరగతి డ్రాపవుట్. ఇక ఉత్తరప్రదేశ్‌లో బోర్డు సీఈవో యునానీ గ్రాడ్యుయేట్. చట్టం ప్రకారం బోర్డు సీఈవో తప్పనిసరిగా సీనియర్ అధికారి అయి ఉండాలి '' అని మెహ్మూద్ పేర్కొన్నారు.
ప్రభుత్వాన్నే తప్పు బట్టకూడదు!
రాష్ట్ర వక్ఫ్‌బోర్డుల్లో అంతర్గత పనితీరును పరిశీలించడానికి జమైత్-ఏ-ఔలేమా హింద్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మెహ్మూద్‌మద్నీ నియమితులయ్యారు. నదీమ్ అహ్మద్‌తో ఇంటర్వ్యూలో మద్నీ మాట్లాడుతూ బోర్డుల్లో చోటుచేసుకుంటున్న అవినీతి మూలంగా అసలు బోర్డుల ప్రాథమిక ఉద్దేశమే తప్పుదారి పడుతోందన్నారు. నిర్వహణా విషయంలో సమగ్ర ప్రక్షాళన జరిగి బోర్డుకు మరింత సాధికారత చేకూరితే తప్ప పరిస్థితిలో ఎటువంటి మార్పూ జరగదన్నారు.
రాష్ట్ర వక్ఫ్‌బోర్డుల పనితీరుపై మీ అభిప్రాయం?
రాష్ట్రవక్ఫ్‌బోర్డుల్లో చాలా అవినీతి ఉంది. అందుకే వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి. బోర్డు నిర్వహణా సామర్థ్యం ఏమాత్రం లేని తమ పార్టీకి చెందిన సాధారణ కార్యకర్తలకు అధికార పార్టీలు వక్ఫ్ బోర్డుల బాధ్యతల్ని అప్పజెబుతున్నాయి. పైగా వారు అవినీతిపరులు కూడా! వారి పనితీరు పట్ల నాకేమాత్రం సంతృప్తి లేదు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో కానీ, భూమి ఆక్రమణలు, అద్దెల విషయంలో కానీ ఏ విధంగానూ వారు అంచనాలకు సరిపోవడంలేదు.
వక్ఫ్ ఆస్తులు చట్టవిరుద్ధంగా ఆక్రమణకు గురై దశాబ్దాలుగా కోర్టుల్లో మూలుగుతున్నాయి. దీనికి మీ కార్యాచరణ ఏంటి?
ప్రస్తుత వక్ఫ్ చట్టాన్ని తక్షణమే పునర్‌వ్యవస్థీకరించాలి. శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)లాగా వక్ఫ్ బోర్డులకు కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. ప్రభుత్వ జోక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. వక్ఫ్ ట్రిబ్యునల్ కూడా పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. తత్సంబంధిత కేసులు తక్షణమే పరిష్కారమవ్వాలి.
వక్ఫ్ బోర్డుల సొంత ఆస్తుల విలువ రూ. వేల కోట్లకు పైమాటే. అయినా అవి ప్రభుత్వ నిధులపైనే ఆధారపడవలసిన దుస్థితిలోనే ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు?
బోర్డుల్లో చెప్పలేనంత అవినీతి ఉంది. దీనికి ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుబట్టలేం. కమ్యూనిటీది కూడా సమాన బాధ్యత ఉంది దీనిలో. వక్ఫ్ బోర్డుల్లో పనిచేయడానికి ముస్లింలకు మాత్రమే అవకాశముంది. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతకు ప్రాముఖ్యమిస్తే వక్ఫ్ బోర్డులు స్వయంసమృద్ధి సాధిస్తాయి.
మీరు జమైత్-ఏ-ఔలేమా హింద్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కూడా. వక్ఫ్‌బోర్డుల ఉన్నతికి మీరు తీసుకున్న చర్యలేంటి?
వక్ఫ్ ఆస్తుల విషయంలో జమైతే-ఏ-ఔలేమా 50 ఏళ్లుగా పలు సందర్భాల్లో పలు చర్యలు తీసుకుంది. ప్రజాస్వామ్య దేశంలో ఒకరి హక్కును పరిరక్షించుకోవడానికి సరైన మార్గం ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటడమే. ఎన్నో సందర్భాల్లో ఈ విషయం గురించి చర్చ ను లేవనెత్తాం.
ఈ చర్యల పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా?
పూర్తిస్థాయిలో మేం చర్యలు తీసుకోలేకపోయామని అంగీకరించడంలో నేనేమాత్రం వెనుకాడను. అయినా చెప్పుకోదగిన స్థాయిలోనే కృషి చేశామని భావిస్తున్నాను. మా కృషిఫలితంగానే ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి.
వక్ఫ్‌బోర్డుకు పరిమిత అధికారాలున్నాయని మీరు భావిస్తున్నారా?
వక్ఫ్ బోర్డుకు పరిమిత అధికారాలున్నాయని నేను కచ్చితంగా భావిస్తున్నాను. బోర్డుకు అదనపు అధికారాలు ఇచ్చే ముందు నిర్వహణా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2010 ప్రవేశపెట్టాలంటారా?
జమైత్-ఏ-ఔలేమా హింద్ వంటి పలు ముస్లిం సంస్థలు వక్ఫ్ బిల్లులో ప్రతిపాదించే సవరణలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిశీలనకు తీసుకోవాలి.
వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ముస్లిం కమ్యూనిటీకి మీరిచ్చే సలహాలేమైనా ఉన్నాయా?
వక్ఫ్ ఆస్తుల్ని ఉమ్మడి ఆస్తిగా భావించాలి. చట్ట విరుద్ధంగా వక్ఫ్ భూముల ఆక్రమణలపై అన్ని ముస్లిం సంస్థలు కలిసికట్టుగా పోరాడాలి.
No comments:
Post a Comment